Saturday, May 18, 2013

చిన్నజీవులకు దెబ్బలు తగలవా?

ఆకారంలో చిన్నగా ఉండే జీవుల తాలూకు శరీర ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా భూమి యెక్క గురుత్వాకర్షణశక్తి వాటిపై చూపించే ప్రభావంకన్నా గాలిలాంటివి వాటి ఉపరితలంపై చూపించే ప్రభావం సాపేక్షికంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. దాంతో ఏదైనా ఒక ఎత్తై ప్రదేశం నుండి కిందకు పడిపోయినప్పుడు పెద్ద జీవులకన్నా చిన్నజీవులకు తక్కువ దెబ్బలు తగులుతాయి.

పడే విధానాన్ని బట్టి, ఎత్తుని బట్టి ఒక్కోసారి ఎలాంటి దెబ్బలూ తగలకపోవచ్చు. అంతేగాని అసలు మొత్తానికే దెబ్బలు తగలవు అనుకోవడం సరైనది కాదు. చిన్నజీవుల శరీరం తాలూకు బరువు, ఘనపరిమాణం తక్కువగానూ, అదే సమయంలో వాటి ఉపరితల వైశాల్యం ఎక్కువగాను ఉండే కారణంగా అలాంటి జీవులు పైనుంచి కిందికి పడుతున్నప్పుడు కేవలం పడిపోతున్నట్లుగా కాక ఎగురుతున్నట్లు లేదా ఎగరడానికి ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తాయి.

ఒక్కోసారి జోరుగా వీచే గాలికి అవి గాలితోపాటు కొంత దూరం కొట్టుకొనిపోతాయి కూడా! వివిధరకాల కీటకాలు, పురుగులకే గాక ఆకులు, విత్తనాలు, కాగితం ముక్కలు వంటి వాటికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏదేమైనా పైనుంచి కిందికి పడిపోయేటప్పుడు మామూలు దెబ్బలు గాని, తీవ్రమైన దెబ్బలు గాని తగిలే అవకాశం పెద్దజీవులకే ఎక్కువ!

కాకులు సంఘజీవులు

కాకులు సంఘజీవులు ప్రపంచంలోని పక్షులన్నింటిలోకి కాకులు చాలా తెలివైనవి శాస్తజ్ఞులు చెబుతున్నారు. అడ్డమైనవీ తింటాయని కాకుల్ని కొందరు అసహ్యించుకున్నా, మరికొందరు వాటిని అపశకునంగా భావించినా కాకుల వల్ల పంటపొలాలకు, పర్యావరణానికీ చాలా మేలు జరుగుతుంది. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తినడం ద్వారా అవి రైతులకు మేలు చేస్తే, ఊళ్ళలోని చెత్తాచెదారంలోని పురుగుల్ని, పదార్థాల్ని తినడం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు తోడ్పడుతున్నాయి.

కాకులు సంఘజీవులు. అవి కేవలం తమ కుటుంబానికి చెందిన కాకులకేగాక, అవసరమైనప్పుడు ఇతర కుటుంబాలకు చెందిన కాకులకూ సాయం చేస్తాయి. గుంపులుగా జీవించే అనేక ఇతర పక్షుల్లోనూ, పిల్లులు, కుక్కలు వంటి జంతువుల్లో కూడా ఈ తరహా ప్రవర్తన మనకు కనిపించదు.

కాకులు తెలివిగా, సంతోషంగా జీవించడమే కాదు, అవసరమైనప్పుడు కట్టెపుల్లల్ని తమకు కావలసిన రీతిలో మలచుకొని వాటిని ‘సాధనాలుగా’ ఉపయోగిస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నిజంగానే, కాకులు చాలా తెలివైనవి కదా! అంతేకాదు, వాటికి జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువేనట.

నిమ్మరసం తాగితే జలుబు చేయదా?

మనదేశంతో సహా చాలా దేశాల్లో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో ‘నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది’ అన్నది కూడా ఒకటి. వానలో తడిస్తే లేదా తడి జుత్తుతో బయట తిరిగితే లేదా ఐస్‌క్రీమ్‌లు తింటే జలుబు చేస్తుంది... అనేవి ఎలా ప్రచారంలోకి వచ్చాయో ఇది కూడా అలాగే ప్రచారంలోకి వచ్చింది. ఇక అసలు విషయంలోకి వస్తే...సాధారణంగా కొన్నిరకాల వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించి మనపై తమ ప్రతాపాన్ని చూపించినప్పుడు మనకు జలుబు చేస్తుంది.

అందుకని నిమ్మరసం తాగడం వల్ల జలుబు చేస్తుంది అన్నది సరైనది కాదు. అంతేకాదు, జలుబు చేసినవాళ్ళు నిమ్మరసం తాగకూడదు అన్నది కూడా సరైనది కాదు. ఎందుకంటే నిమ్మరసం తాగడం వలన జలుబు రాదు సరికదా, వచ్చిన జలుబు తగ్గుముఖం పడుతుంది.

నిమ్మరసంలో ‘విటమిన్-సి’ అనేది పుష్కలంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసు కదా! అది మన శరీరపు రోగనిరోధకశక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే నిమ్మరసం తీసుకోవడం వలన జలుబు వైరస్‌లతో పోరాడే శక్తి మన శరీరానికి మరింతగా పెరుగుతుందన్నమాట.

అరటి, ఆపిల్స్, బత్తాయిలు వంటి పళ్ళతో సహా అన్నిరకాల పళ్ళను పుష్కలంగా తినమని డాక్టర్లు మరీమరీ చెప్పేది ఎందుకో తెలుసా? అవి మనకు మంచి పోషకాలను అందించడమేగాక మన వ్యాధినిరోధకశక్తి (వ్యాధులతో పోరాడి వాటిని అడ్డుకునే శక్తి)ని పెంచుతాయి.
అందుకని కేవలం నిమ్మపళ్ళ విషయంలోనేగాక ఏ పళ్ళ విషయంలోనూ అనవసరమైన ఆలోచనలను పెట్టుకోకండి.